దైవ ప్రేరణ vs పురుషార్థం (నిజప్రయత్న ప్రాధాన్యం) –  | యోగ వాశిష్టం S2 EP-9 | Yoga Vasistha

అదృష్టం, దైవ ప్రేరణ అనేవి నిజంగా ఉన్నాయా? లేక మన పురుషార్థమే మన రాతను మారుస్తుందా? "

బలమైన చెట్టు బలహీనమైన చెట్టును కప్పివేసినట్లే, మనిషి చేసే వర్తమాన ప్రయత్నాలు (ఐహిక పురుషకారం) గత జన్మల ప్రాక్తన కర్మలను అణగదొక్కి కొత్త ఫలితాలను తీసుకురాగలవని వశిష్ఠుడు తెలిపాడు.

శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తున్న “ముముక్షు వ్యవహార ప్రకరణం”లో భాగంగా, కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అత్యంత గహనమైన రహస్యాలు వెల్లడవుతున్నాయి. అదృష్టం, దైవ ప్రేరణ అనేవి నిజంగా ఉన్నాయా? లేక మన ప్రయత్నమైన పురుషార్థం మన రాతను మారుస్తుందా? అనే విషయాలపై వశిష్ఠుడు తన బోధనను ఎంతో స్పష్టంగా కొనసాగించాడు.

దైవ ప్రేరణ – పురుషార్థము: సంసార సాగరాన్ని ఎలా దాటాలి?

ఈ జగత్తులోని పదార్థాలన్నీ దేశ (ప్రదేశం), కాల (సమయం), క్రియ (పని), ద్రవ్యముల (వస్తువుల) శక్తిని అనుసరించే ప్రకాశిస్తున్నాయి అని వశిష్ఠుడు వివరించాడు. వీటన్నింటిలో ఎవడైతే అత్యధిక యత్నశీలి (ఎక్కువగా కష్టపడేవాడు) అవుతాడో, వాడే చివరకు విజయం సాధిస్తున్నాడు. అందువల్ల, మానవుడు ఎల్లప్పుడూ తన పౌరుష బలాన్నే (సొంత కష్టాన్నే) ఆశ్రయించాలి తప్ప, కంటికి కనిపించని తెలియని దైవం మీద భారం వేసి, ప్రయత్నం చేయకుండా బద్ధకంగా ఉండటం ఏమాత్రం ఉచితం కాదని మహర్షి హెచ్చరించాడు.

మొట్టమొదట మనిషి సాధు సాంగత్యాన్ని (మంచి వారితో స్నేహాన్ని), శాస్త్ర విచారణను ఆశ్రయించి తన మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి (చిత్తశుద్ధిని సంపాదించాలి). ఆ చిత్తశుద్ధి సహాయంతోనే ఈ దుర్భరమైన సంసార సాగరాన్ని ఈదగలుగుతాడని వశిష్ఠుడు దారిచూపాడు.

“ప్రాక్తన కర్మలు (గత జన్మల కర్మలు) మరియు ఐహిక పురుషకారం (వర్తమాన ప్రయత్నాలు) అనే ఈ రెండు ఫల వృక్షాలలో, ఏ చెట్టు అయితే బలమైనదో.. అది తనకంటే బలహీనమైన చెట్టును ఎలా కప్పివేస్తుందో, అలాగే మనం చేసే వర్తమాన ప్రయత్నాలు మన గత కర్మలను కప్పివేస్తాయి” అని మహర్షి అద్భుతమైన ఉదాహరణతో వివరించాడు. మానవుడైనవాడు తన నిజప్రయత్నాల చేత (తన కష్టంతో) ప్రాక్తన కర్మలను (గత కర్మలను/దోషాలను) అణగదొక్కి వేయాలి.

ఎవడైతే అలా కష్టపడడో, వాడికి తన సుఖ దుఃఖాల రెండింటి మీదా స్వయం నియంత్రణ (స్వాతంత్ర్యం) ఉండదు. తన ప్రయత్నాలను బలోపేతం చేసుకోలేని వాడు కేవలం పశువుతో సమానమని వశిష్ఠుడు కరాఖండిగా చెప్పాడు. అలాంటి జీవుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గ, నరకాలకు వస్తూ పోతూ ఉంటాడే తప్ప, ఎప్పటికీ స్వతంత్రుడు కాలేడు. అట్టివాడు ఎల్లప్పుడూ పరాధీనుడే (ఇతరులపై ఆధారపడేవాడే), ఇక వాడికి ‘మోక్షం’ గురించి ఆలోచించే అర్హత ఎక్కడిది? అని ప్రశ్నించాడు.

సదాచార సంపన్నుడై, నిరంతరం శ్రమించే వాడు (ప్రయత్నశీలుడు) మాత్రమే ఈ ‘జగన్మాయ’ (మాయాజగత్తు) అనే పంజరాన్ని ఛేదించి బయటకు రాగలుగుతాడు. అతనికి తన ఉదారమైన, చమత్కారమైన స్వకీయ పురుషార్థం తోడుగా నిలిచి బంధ విముక్తిని ప్రసాదిస్తుందని వశిష్ఠుడు తెలిపాడు.

అదృష్టాన్ని నమ్మే అప్రయత్నశీలురను దూరంగా పెట్టండి!

“కశ్చిన్మాం ప్రేరయిత్యేవమ్ ఇత్యనర్థ కుకల్పనే | యఃస్థితో దృష్టముత్సృజ్య సత్యాజ్యో సౌ దూరతో ధమః “

దీని అర్థం ఏంటంటే.. ఎవరైతే తమ కళ్లెదురుగా స్పష్టంగా కనిపిస్తున్న పురుష ప్రయత్నాన్ని, దానివల్ల వచ్చే గొప్ప ప్రయోజనాన్ని గుర్తించకుండా, “నన్ను ఎవరో ఎక్కడి నుంచో ప్రేరేపిస్తున్నారు, లేక నా ప్రయత్నాల నుంచి నన్ను అడ్డుకుంటున్నారు, అందుకే నా పరిస్థితి ఇలా తయారైంది” అని తలచుకుంటూ పిచ్చి కుకల్పనలు (ఊహలు) చేసుకుంటారో.. లక్ష్యశుద్ధి లేకుండా కష్టపడకుండా సోమరిపోతుల్లా ఉంటారో.. అలాంటి వారిని అత్యంత దూరంగా త్యజించడం (వదిలేయడం) మంచిదని వశిష్ఠుడు సలహా ఇచ్చాడు.

వేలకు వేలు వ్యవహారాలు ప్రతిరోజూ ఈ మానవుని సమక్షమునకు వస్తున్నాయి, పోతున్నాయి. వాటి పట్ల రాగద్వేషాలు (అతిగా ఇష్టపడటం లేదా ద్వేషించడం) లేకుండా, శాస్త్రం చెప్పినట్లుగా ఆచరించడమే ఉత్తమం. సముద్రంలోకి రత్నాలన్నీ వచ్చి ఎలా చేరతాయో, అలాగే శాస్త్రానుసారంగా, లోకానికి అనుకూలంగా తమ పనులను (స్వీయకర్మలను) కాపాడుకునే వారి వద్దకు ఉత్తమ గుణాలు, వారు కోరుకున్న అభీష్ట సిద్దులు అన్నీ వచ్చి చేరుతాయని వశిష్ఠుడు ఒక అందమైన పోలికతో వివరించాడు.

ఏ ప్రయత్నాలయితే మనిషికి సుఖాన్నిచ్చి, దుఃఖాన్ని దూరం చేస్తాయో.. అలాంటి సత్ప్రయత్నాలనే విజ్ఞులైన పెద్దలు “పౌరుషము” అని నిర్ణయించారు. శాస్త్ర విహితములైన (శాస్త్రాలు అంగీకరించిన) అట్టి యత్నములే “పురుషార్థము” అనే గొప్ప ప్రయోజనాన్ని కలుగజేస్తాయని మహర్షి వివరించాడు.

కర్మ సిద్ధాంతంలోని ఈ అద్భుత రహస్యాన్ని గ్రహించిన బుద్ధిమంతులు ఎన్నడూ తమ కాలాన్ని ఊరకే వృథా చేయరు. “అయ్యో! నాకిది దక్కుతుందో? లేదో?” అనుకునే ప్రాపాప్రాప్తములు వారికి ఒక లెక్కలోనివి కావు. చేసే ప్రయత్నాన్ని బట్టే ప్రయోజనం ఉంటుందని వారికి స్పష్టంగా తెలుసు. అందుకే వారు గురుసేవ, స్వాధ్యాయనం (తనను తాను తెలుసుకోవడం), సాధు సంగం, సచ్ఛాస్త్ర శ్రవణం, పరోపకారం మొదలైన ప్రయత్నాల ద్వారా, తమ మనస్సులోని దోషాలను తొలగించుకుంటారు (చిత్తశుద్ధిని పొందుతారు).

దాని ద్వారా వారు ఆత్మోద్ధరణను సాధించి, స్వస్వరూపమైన, సర్వస్వరూపమైన “ఆత్మానుభవము” అనే పురుషార్థాన్ని క్రమంగా పొందుతారు. మాటలతో వర్ణించలేని (అనిర్వచనీయమైన) ప్రశాంతతను వారు అవధరిస్తారు. కనుక ఓ రామా! నువ్వు చేసే సర్వ విధాలైన లౌకిక (ఈ లోకానికి సంబంధించిన), పారలౌకిక (పరలోకానికి సంబంధించిన) ప్రయత్నాలన్నీ కేవలం “చిత్తశుద్ధిని పొందాలి” అనే ఏకైక లక్ష్యంతోనే చేయాలి కానీ, మరెందుకూ కాదని వశిష్ఠుడు ఉద్బోధించాడు.

RECOMMENDED PRODUCT

REMEDYWALA పంచముఖి రుద్రాక్ష బ్రాస్‌లెట్ నాణ్యత సమాచారం

REMEDYWALA పంచముఖి రుద్రాక్ష బ్రాస్‌లెట్ నాణ్యత సమాచారం : ఈ ప్రొడక్ట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?

ఈ సమీక్ష ధృవీకరించబడిన కొనుగోలుదారుల ఫీడ్‌బ్యాక్ మరియు తయారీదారు పేర్కొన్న స్పెసిఫికేషన్‌లను ఉపయోగించి REMEDYWALAను పరిశీలిస్తుంది. రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక… ఈ పరిస్థితిలో REMEDYWALA పంచముఖి రుద్రాక్ష బ్రాస్‌లెట్ ఒక స్పష్టమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఐదు ముఖాల సహజ రుద్రాక్ష పూసలతో పాటు ప్రామాణికత ధ్రువీకరణ సర్టిఫికేట్ అందించడం… REMEDYWALA పంచముఖి రుద్రాక్ష బ్రాస్‌లెట్ అనేది సర్టిఫికేట్‌తో వచ్చే సహజమైన ఐదు ముఖాల రుద్రాక్ష పూసలతో రూపొందించిన ఆధ్యాత్మిక సాధనం. ప్రతి పూసను చేతితో ప్రత్యేకంగా ముడివేసి…

ఈ ప్రొడక్ట్ గురించి మరింత చదవండిBuy on Amazon

As an Amazon Associate, RamthaMedia earns from qualifying purchases.

దైవం అంటే ఏమిటి? అసలైన అదృష్టం ఎక్కడ ఉంది?

నాయనా రాఘవా! మనుషుల మధ్య ఉన్న ఈ ద్వైత వైషమ్యమంతా (భేదభావాలన్నీ) కేవలం అజ్ఞానం వల్లే ప్రాప్తిస్తోంది. అలాంటి వైషమ్యాన్ని తొలగించి, ‘సమతానందము’ (అందరినీ సమానంగా చూసే ఆనందాన్ని) పొందించే దానినే “పురుషార్థం” అని పెద్దలు పిలుస్తున్నారని మహర్షి తెలిపాడు. ఆ అఖండానందమే జీవుడి లక్ష్యం కావాలి. దానిని ప్రాప్తింపజేసే శాస్త్రాలను, సాధువులను, సత్కర్మలను ఎల్లవేళలా సేవించాలని సూచించాడు.

గత జన్మల్లో (పరలోకములలో) అనుభవించగా మిగిలిన ప్రాక్తన కర్మల శేషమే.. మనతో పాటు ఈ లోకానికి వచ్చి మన ప్రస్తుత వర్తమాన అనుభవాలకు కారణమవుతోంది. దానినే సామాన్య జనులు ‘దైవము’ అని పిలుస్తున్నారని వశిష్ఠుడు అసలు గుట్టు విప్పాడు.

ఇది కష్టము, ఇది సుఖము అనే భావన భ్రాంతియే కాబట్టి ఆ అనుభవాన్ని మహర్షి ‘భ్రాంతము’ అని వర్ణించాడు. కంటికి ఎదురుగా కనబడనిది కాబట్టి గత కర్మను ‘అదృష్టము’ అని అన్నాడు. అలాంటి అదృష్టాన్ని (ప్రాక్తన కర్మను) తలచుకుని “అయ్యో! దైవమా! నాకెందుకిలా జరుగుతోంది?” అని నిందించుకుంటూ ప్రజలు కొంత ఊరట పొందుతున్నారు. వాళ్ళను ఆ ఊరటను అలాగే పొందనీ, వాళ్ళను నేను ఏమీ అనటం లేదు.

“కానీ, వర్తమానంలో తాము చేయాల్సిన స్వంత కష్టాన్ని (పురుషకారాన్ని) వదిలేసి, మూఢులు కల్పించిన ఆ ‘అదృష్టాన్ని’ నమ్ముకుని కూర్చునే వారిని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఆ అదృష్టం ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి లభిస్తోంది?” అని వశిష్ఠుడు నిలదీశాడు. అదృష్టాన్ని నమ్ముకుని ఏ పనీ చేయకుండా కూర్చునే నిష్క్రియులు చివరకు నాశనం (క్షయము) వైపే పయనిస్తున్నారని మహర్షి గట్టిగా గుర్తుచేశాడు.

ఎందుకంటే.. మనిషి తన సొంత పౌరుష బలం (కష్టం) వల్లే సకల శుభాలు కలుగుతుండగా, అలాంటి స్వప్రయత్నం విషయంలో అశ్రద్ధగా ఉండటం ఎలా ఉచితం అవుతుంది?. మనం ఇప్పుడు చేసే వర్తమాన సత్కార్యాలు, ప్రాయశ్చిత్త కర్మలే రేపు శుభాలుగా మారి భవిష్యత్తులో మనకు శోభను (ఆనందాన్ని) కలగజేస్తాయని వివరించాడు.

అందుచేతనే ఓ రామా! మనిషి ఎల్లప్పుడూ కార్యశీలుడు (నిరంతరం పనిచేసేవాడు) కావాలి. బద్ధకాన్ని, అశ్రద్ధను వదిలేయాలి. అప్పుడే అతడు తన స్వంత పురుషకారం (కష్టం) చేత తాను కోరుకున్న ఫలాన్ని అరచేతిలోని ఉసిరికాయ వలె ప్రత్యక్షంగా పొందగలడు. కేవలం మూఢుడైన వాడు మాత్రమే కంటికి ఎదురుగా ఉన్న నిజప్రయత్నాన్ని వదిలేసి ‘అదృష్టము’ అనే మోహంలో (భ్రమలో) కూరుకుపోతున్నాడు.

ఓ శుభాశయా! రామచంద్రా! ఈ కార్యకారణాలకు సంబంధించిన నీ సమస్త సంశయాలను (అనుమానాలను) ఇక కాస్త పక్కకు పెట్టు. కేవలం నీ మనస్సు (చిత్తవృత్తి) బలం చేత కల్పించబడిన, మిథ్య అయిన ఆ ‘దైవము’ లేదా అదృష్టము అనే దానిని ఆశించడం ఇకనైనా మానుకో. కేవలం నీ పురుషార్థం (సొంత కష్టాన్ని/ప్రయత్నాన్ని) మాత్రమే నమ్ముకుని నీ జీవితాన్ని ఉద్ధరించుకో (ఉద్ధారణ పొందెదవు గాక!) అని వశిష్ఠుడు దీవించాడు.

చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానం ఎలా లభిస్తాయి?

నిజప్రయత్న ప్రాధాన్యం గురించిన విచారణలో, వశిష్ఠ మహర్షి మరింత లోతైన విషయాలను ప్రస్తావించాడు. ఈ జీవుడు చిత్తశుద్ధిని (మనస్సులో ఎలాంటి దోషాలు లేని స్థితిని) పొందితే అన్నీ సుస్పష్టంగా తెలుస్తాయి. అయితే అసలు ఆ చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది? దానికి మార్గం జ్ఞానం మాత్రమే.

📖 జీవుడు ఎన్ని రకాలు? 14 జన్మల రహస్యం | యోగ వాశిష్టం S3 EP-52 | Yoga Vasistha

జీవుడిని సముద్ధరించగల (సంసార సాగరం నుంచి దాటించగల) అత్యుత్తమమైన ఆత్మజ్ఞానం లభించాలంటే, అది వేదాలు మొదలైన సచ్ఛాస్త్రాల ద్వారా, సత్పురుషుల ఆచరణల ద్వారా, వారు చేసే ప్రవచనాలను వినడం ద్వారానే సాధ్యపడుతుందని వశిష్ఠుడు తెలిపాడు (జీసస్, మహమ్మద్, బుద్ధుడు, గురునానక్ వంటి గొప్ప ప్రవక్తలు బోధించిన గ్రంథాల ద్వారా కూడా ఇది సాధ్యమే).

అలాగే, మనం ఉన్న దేశకాలాలను బట్టి (సమయం, సందర్భాలను బట్టి) చెప్పబడిన ధర్మాలను ఖచ్చితంగా ఆచరించాలి. ప్రతిక్షణం మన హృదయంలో “చిత్తశుద్ధి – జ్ఞానము” అనే రెండు మధురమైన ఫలాలను ఉత్పత్తి చేయగలిగే ఉపాయాల కోసం మనం నిరంతరం అన్వేషించాలి. ఆ నిరంతర ప్రయత్నాలనే ఆశ్రయించాలి. అందుకు మనలో ‘తీవ్రేచ్ఛ’ (దాన్ని ఎలాగైనా సాధించాలనే విపరీతమైన కోరిక/తపన) ఉండాలి.

ఓ రామా! ఒక మనిషి గనక ‘చిత్తశుద్ధి, జ్ఞానం పొందాలి’ అనే తీవ్రేచ్ఛ కలిగి ఉంటే, దానికి సంబంధించిన సాధనాలు, అనుకూలమైన ప్రయత్నాలు వాటంతట అవే సమకూరుతాయి. అలా ప్రయత్నించే వానిలో కనిపించే కార్యక్రమ వ్యవహారాలనే “పౌరుషము” అని అంటారని వశిష్ఠుడు వివరించాడు.

ఒక మల్లయుద్ధ వీరుడు (రెజ్లర్) పోటీలో గెలవాలంటే శారీరక బలం, మెదడు తెలివి రెండూ కావాలి కదా! అలాగే జీవుడు కూడా ఈ మాయను జయించాలంటే రెండు విషయాలను సంపాదించుకోవాలి.

  1. ఉత్తమ ప్రయత్నాల ద్వారా (తపస్సు, ధ్యానం, లోకోపకార పనులు, నామస్మరణ మొదలైనవి) పొందగలిగే “చిత్తశుద్ధి”.
  2. సద్గురుసేవ, శాస్త్ర విచారణ, స్వయంగా విచారించుకోవడం వంటి వాటివల్ల వికసించే “జ్ఞానము”.

కనుక ఓ ప్రియ రామచంద్రా! మనిషి మొట్టమొదట తన బుద్ధిబలంతో పురుషార్థం వైపు నిలిచి, సొంత ప్రయత్నాన్ని ఆశ్రయించి ఎల్లవేళలా అన్ని విధాలుగా కష్టపడటమే సముచితం. అప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది. ఆ తర్వాత, శాస్త్రాలను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నాలకు ఒక సఫలత (విజయం) చేకూర్చుకోవడమే మన అసలైన కర్తవ్యమై ఉన్నది.

మహాత్ములైన వివేకశీలురు (జ్ఞానులు) దైవము మరియు పురుషకారం.. ఈ రెండింటి బలాబలాలను చక్కగా బేరీజు వేసుకుని, పరిశుద్ధమైన లక్ష్యంతో వర్తమాన ప్రయత్నాలను ఉత్సాహపూరితం చేసుకుంటారు. అందుకే వారు తాము జీవించి ఉన్నందుకు అత్యుత్తమమైన ప్రయోజనాన్ని పొందుతారు.

కాబట్టి, నువ్వు కూడా జ్ఞాన సేవితమైన శ్రవణ, మననాదులను (మంచి విషయాలు వినడం, వాటిని ఆచరించడం) ఆశ్రయించు. ఎల్లప్పుడూ నీ ఆత్మోద్ధారణ వైపే ప్రయాణించు గాక!.

స్వాభావికమైనట్టి ఐహిక (వర్తమాన) పురుషకారాన్నే (సొంత కష్టాన్నే) కార్యసిద్ధికి ఏకైక ఉపాయంగా జీవుడు భావించాలి. ఆత్మజ్ఞానులైన పండితులు చెబుతున్న మాటలను పట్టించుకోకుండా, వారిని ఉపేక్షిస్తూ రోజులు గడపటం ఎవరికీ ఉచితం కాదు. అలాంటి వారిని సేవించి, ఏది సత్యం, ఏది అసత్యం అనే వివేకాన్ని (జ్ఞానాన్ని) సంపాదిస్తూ, సత్కర్మాచరణులై జనన మరణ రూపమైన ఈ ‘సంసారభ్రమ’ అనే భయంకర రోగం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించెదరు గాక! మీరు శాంతిని, సమతాభావాన్ని పొందెదరు గాక! అని వశిష్ఠుడు ఆశీర్వదించాడు.

నిజప్రయత్న ప్రాధాన్యం: పౌరుషమే సమస్తానికీ మూలం

ఓయీ మానవుడా! నువ్వు ఈ ఉత్తమమైన ఉపాధిని (శరీరాన్ని) పొందావు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని విచారించి గ్రహించగలిగే సూక్ష్మ బుద్ధిని కూడా పొందగల సామర్థ్యం నీకు ఉంది. (సాధారణ జంతువుల బుద్ధితో పోల్చినప్పుడు మానవుని బుద్ధి ఎంతో సునిశితమైనదే కదా!). ఎన్నో సాధనలకు అవకాశమున్న ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం ఏమాత్రం తగిన పని కాదు.

కాబట్టి శ్రద్ధాసక్తుడవై, స్వస్వరూపమైన ఆత్మయందు లయం అయ్యే లక్ష్యంతో వ్యవహరించు. ఈ దుష్టమైన సంసార వ్యవహారాన్ని నీ అంతరంగం నుంచి శాశ్వతంగా తొలగించివేయి అని వశిష్ఠుడు పిలుపునిచ్చాడు.

తన ‘పురుషకారం’ (కష్టం) చేత ‘అదృష్టాన్ని’ నివారించడానికి ప్రయత్నించే వాడికి ఈ ఇహలోకంలో, పరలోకంలో అభీష్టసిద్ధి (అనుకున్నది నెరవేరడం) ప్రాప్తిస్తుంది. అలా కాకుండా అదృష్టాన్ని గుడ్డిగా నమ్మి ఎలాంటి ప్రయత్నం చేయని వారు తమకు తామే పెద్ద శత్రువులు అవుతున్నారు. తమలోని ధర్మార్థ కామాలను తామే నాశనం చేసుకుంటున్నారు. ఇక మోక్షం గురించి వాళ్లకి వేరే చెప్పేదేముంది?.

పౌరుషం (మానవ ప్రయత్నం) యొక్క స్వరూపాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయని వశిష్ఠుడు విభజించాడు.

  1. ఒక పురుషార్థాన్ని (లక్ష్యాన్ని) ఎలాగైనా సాధించాలనే ‘ఇచ్ఛ’ (బలమైన కోరిక).
  2. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కర్మేంద్రియాలు చేసే ‘ప్రవృత్తి’ (శారీరక శ్రమ/పని).
  3. ఆ పనిని ఎలా చేయాలో తెలిపే ‘తత్త్వజ్ఞాన వికాసం’ (మెదడును, జ్ఞానాన్ని ఉపయోగించడం).

RECOMMENDED BOOK

మాయా ప్రపంచం అంతర్యామి పిలుపు తెలుగు పుస్తకం by A. Ravinder

మాయా ప్రపంచం అంతర్యామి పిలుపు తెలుగు పుస్తకం By A. Ravinder

మన చుట్టూ కనిపించే ప్రపంచం నిజమా? లేక ఇది ఒక మాయా Simulation మాత్రమేనా?

యోగవాశిష్టం మాయా సిద్ధాంతాన్ని తెలుగులో వివరించే ఆధ్యాత్మిక పుస్తకం. జీవితం, ప్రపంచం, అంతర్యామి స్వరూపం గురించి లోతైన అన్వేషణతో పాటు, మనస్సు మరియు మాయ యొక్క లోతైన తత్త్వాన్ని సరళమైన భాషలో వివరిస్తుంది. సాధకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆచరణాత్మక సందేశాన్ని పొందుతారు. ఈ పుస్తకం ప్రింట్ వర్షన్, మరియు ఈబుక్ ఇన్‌స్టాంట్ రీడ్ వర్షన్‌లలో లభ్యమవుతుంది.

📖 Printed Book📱 Ebook

ఈ మూడు అంశాలూ ఒకదానికొకటి ‘తోడు’ అవుతూనే మనిషికి ఉత్తమ ఫలాన్ని ప్రాప్తింపజేస్తున్నాయని మహర్షి విశ్లేషించాడు. మన మనస్సులో ఎలాంటి విషయం స్ఫురిస్తుందో (ఆలోచన వస్తుందో), మన చిత్తం (మనస్సు) కూడా అలాంటి ఆకారాన్నే దాల్చుతుంది. ఆ చిత్తం నుంచే ఇంద్రియాల ద్వారా మనం చేసే పనులు బహిర్గతం అవుతాయి.

ఒకడు తన బాల్యం నుండి ఏఏ విషయాల గురించి ఏఏ ప్రయత్నాలు చేస్తాడో – భవిష్యత్తులో వాడికి వచ్చే ఫలితాలు కూడా వాడు చేసిన ఆ ప్రయత్నాలను బట్టే ఉంటాయి. ఇక ఇందులో ‘దైవము’ లేదా అదృష్టం అనే దానికి చోటు ఎక్కడ ఉంది? అందుకే ‘పౌరుషమే’ సమస్తానికీ మూలకారణమని మేం గట్టిగా సిద్ధాంతీకరిస్తున్నామని వశిష్ఠుడు స్పష్టం చేశాడు.

“ఓ రాఘవా! ఎవరైనా సరే.. వాళ్ళు దేవతలైనా, రాక్షసులైనా, మనుషులైనా.. వాళ్ళ స్వంత పురుషకారం (శ్రమ) వల్లే ఈ జగత్తులో ఏదైనా పొందగలుగుతున్నారు” అని వశిష్ఠుడు ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు.

  • తన పురుషకారం వల్లే బృహస్పతి సాక్షాత్తూ ఆ దేవతలకు గురువు కాగలిగాడు.
  • అలాగే తన స్వంత కష్టం, తపస్సు వల్లే శుక్రాచార్యుడు రాక్షసులకు ఆచార్యుడై వెలుగొందుతున్నాడు.
  • సామాన్య మనుషుల్లో కూడా ఎంతోమంది ఎన్నో దారిద్య్రాలతో, కష్టాలతో పీడింపబడినా కూడా, ఉత్తమ పురుషార్థం మరియు నిజప్రయత్నాన్ని నమ్ముకుని అహర్నిశలు శ్రమించి ఇంద్ర సమానులయ్యారు (అత్యున్నత స్థాయికి చేరారు).
  • అదే సమయంలో ‘నహుషుడు’ లాంటి కొందరు రాజులు ఎన్నో సంపదలతో, భోగభాగ్యాలతో తులతూగుతున్నా కూడా, తమ స్వప్రయత్నంలో చేసిన దోషాల వల్ల (తప్పుల వల్ల) చివరకు నరకంలో కూలిపోయారు.

“ఎదురుగా ఉన్న ఈ ప్రపంచాన్నే చూడు. ఇక్కడ జీవులు వేలకు వేలుగా తమకు సంభవిస్తున్న ఆపదలను, దుర్దశలను తమ స్వంత పురుష ప్రయత్నం చేతనే కదా అధిగమిస్తున్నారు!” అని మహర్షి లాజిక్‌గా వివరించాడు.

శాస్త్రాలు ఎందుకోసం రచించబడ్డాయి? “చెడు మార్గంలో పయనించే మనిషి మనస్సును, అన్ని విధాలా సత్ప్రయత్నాల ద్వారా మంచి మార్గం వైపు మరలించాలి” అని ప్రతిపాదించి, మానవుని బుద్ధిని చక్కదిద్దడానికే కదా! అవి సక్రమంగా అర్థం చేసుకోబడాలి, ఆచరించబడాలి.

గురువులు, పెద్దలు కూడా సామాన్యులకు “నాయనలారా! ఈ శుభదాయకమైన, ఆపదలు లేని, ఉత్తమ ఫలితాలు ఇచ్చే సత్కర్మలను యథారీతిగా (ఎలా చేయాలో అలా) యత్నపూర్వకంగా (కష్టపడి) ఆచరించండి” అనే ఉపదేశిస్తారు తప్ప, “దైవమే అన్నీ ఇస్తాడు, మీరు ఏమీ చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్లు తిని, తిరగండి” అని ఏ శాస్త్రం, ఏ గురువు చెప్పటం లేదు కదా అని వశిష్ఠుడు ప్రశ్నించాడు.

దైవం అనే మాట బుద్ధిమంతులు ఎందుకు వాడతారు?

“నేను ఏ రకంగా అయితే ప్రయత్నిస్తున్నానో, నాకు వచ్చే ఫలాలు కూడా అదే రీతిలో ప్రాప్తిస్తున్నాయి. కాబట్టి నేను నా ప్రయత్నాలనే సరైన మార్గంలో నియమిస్తాను (కష్టపడతాను)” అని ప్రతి మానవుడు భావించాలి. ఎప్పుడైతే అతడు అలాంటి సద్విమర్శ (తనను తాను విమర్శించుకోవడం) చేయడో, అప్పుడు తనకు దైవం వలనో, అదృష్టం వలనో, లేక ఇతరుల వలనో ఈ కష్టాలు వస్తున్నాయని అనుకుని వాపోవడం (ఏడవడం) జరుగుతోందని వశిష్ఠుని అభిప్రాయం.

అతడు తన జీవితంలో అనేకసార్లు “అసలు నా సామర్థ్యం ఎంతుంది? నా ప్రయత్నం నేను సరిగ్గా చేశానా లేదా?” అని తనను తాను ప్రశ్నించుకోకుండా.. “వారి వల్లే నేను ఇది సాధించలేకపోయాను” అని పరులను దూషించడానికి (నిందించడానికి) దిగుతున్నాడని ఆయన వాపోయాడు.

కార్యసిద్ధి (విజయం) అనేది కేవలం పౌరుష బలం (శ్రమ) వల్లే జరుగుతుందనేది ఒక నిర్వివాదాంశం (ఎలాంటి వివాదాలకు తావులేని సత్యం). బుద్ధిమంతులు తాము చేసే పౌరుష బలాన్ని ఆశ్రయించి తమ కార్యాల ద్వారా అనేకులను ప్రభావితం చేయగలుగుతున్నారు.

మరి ‘దైవం’ అనే మాట ఎందుకు పుట్టింది? జీవితంలో ఎవరికైనా వారికి ఇష్టం లేనివి, విపరీతమైన కష్టాలు సంభవించినప్పుడు అల్పబుద్ధి గలవారిని (జ్ఞానం లేని వారిని) ఆ బాధ నుంచి ఓదార్చడానికి మాత్రమే ఈ బుద్ధిమంతులైన వారు ‘దైవము’ అనే శబ్దాన్ని ఉపయోగించడం జరిగింది. అట్లు కల్పించబడిన ఆ ‘దైవము’ పట్ల భక్తితో గానీ లేదా భయంతో గానీ వారు ఉత్తమ కార్యాలు (సత్కర్మలు) చేస్తే.. ఆ శిష్యులు క్రమంగా ఉత్తమ బుద్ధి కలవారై అంతిమ సత్యాన్ని గ్రహిస్తారన్నదే ఆ బుద్ధిమంతుల అసలు ఉద్దేశం.

ఇది ఎలాంటిదంటే… చిన్నపిల్లలకు ప్రమాదాలు జరగకుండా భయపెట్టి వారికి సత్ప్రవర్తన నేర్పడం లాంటిదే. అయితే ‘దైవం’ అనే శబ్దం స్వయంగా ఏదీ ప్రసాదించదు. మన ప్రయత్న బలాన్ని బట్టి వచ్చే సదవగాహన, సత్ప్రవర్తన నుంచే మనిషికి ఔన్నత్యం (విజయం) లభిస్తుందని గ్రహించు అని వశిష్ఠుడు బోధించాడు.

ఒకడు ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లాలంటే కూడా తన సొంత ప్రయత్నమే వాడికి శరణ్యం అవుతుంది (అంటే తన కాళ్ళతో తానే నడవాలి తప్ప దేవుడు వచ్చి మోసుకెళ్లడు). “పురుషార్థం (నిజమైన కష్టమే) ఫలవంతం అవుతుంది” అనేది అందరికీ, అన్నివేళలా ఎదురయ్యే ప్రత్యక్ష అనుభవం కదా!.

  • భోజనం చేసిన వాడికే కదా రుచి తెలిసేది! వాడికే కదా ఆకలి తీరేది! తృప్తి కలిగేది! అసలు భోజనమే చేయని వాడికి ఆకలి ఎలా తీరుతుంది?.
  • అలాగే తన కాళ్ళతో నడిచేవాడే గమ్యానికి వెళ్లగలుగుతాడు. నడవనివాడు ఎలా వెళ్తాడు?.
  • నోరు విప్పి మాట్లాడే వాడే తన మనస్సులో ఏముందో చెప్పగలుగుతాడు. మాట్లాడని వాడు తాను అనుకున్నది పక్కవాడికి ఎలా అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు?.

అందుచేత పౌరుషమే జనులకు సిద్ధిదాయకం అవుతుంది (విజయాన్నిస్తుంది) అనే విషయంలో ఎవరికీ, ఏమాత్రం సందేహం ఉండవలసిన అవసరమే లేదని మహర్షి తీర్మానించాడు. అనేకమంది ధైర్యవంతులు పౌరుషాన్ని నమ్ముకునే గొప్ప గొప్ప కష్టాల నుంచి, సంకటాల నుంచి బయటపడుతున్నారు. “అబ్బే! మా అదృష్టం ఇంతే కాబోలు” అని నమ్మి ఊరకే చేతులు కట్టుకుని కూర్చునేవాళ్లు జీవితంలో ఏమి సాధించగలరో చెప్పు? అని రాముడిని ప్రశ్నించాడు.

📖 సమ్యగ్దర్శనము అంటే ఏమిటి? జగత్తు అసలు పుట్టలేదా? | యోగ వాశిష్టం S3 EP-51 | Yoga Vasistha

ముగింపు: కార్య-కారణ సంబంధం ఎప్పటికీ మారదు!

ఓ రామా! నేను మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తున్నాను.. ఏ వ్యక్తి అయితే దేని కోసం ఎంతగా ప్రయత్నిస్తాడో, అతడు దానిని అంతవరకే, అట్లే పొందుతున్నాడు. తూష్ణీభావం వహించి (ఏమీ పట్టనట్లుగా) ఊరుకునే వాడికి ఎక్కడా ఏమీ సిద్ధించడం లేదు.

శుభ పురుషకారం (మంచి ప్రయత్నం) ఎప్పుడూ శుభానికే దారితీస్తుంది. అశుభ పురుషకారం (చెడు ప్రయత్నం) అశుభానికే దారితీస్తుంది. కాబట్టి నీవు దేనినైతే కోరుకుంటున్నావో, దాని కోసమే అత్యుత్తమ ప్రయత్నం చెయ్యి. ఇక ఫలితం అంటావా.. అది తక్షణమే లభించవచ్చు లేదా కాస్త ఆలస్యంగా ప్రాప్తించవచ్చు. ఏది ఏమైనా మంచి ప్రయత్నాలకు మంచి, చెడు ప్రయత్నాలకు అమంగళం (చెడు) వచ్చి తీరుతాయి. వాటిని ఆ దేవుడు కూడా నిరోధించలేడు (అడ్డుకోలేడు). ఇది అప్రతిహతమైన (తిరుగులేని) విధాన శాసనం అని వశిష్ఠుడు కుండబద్దలు కొట్టాడు.

అయితే, ఇలా మనిషి తన పౌరుష బలం చేత, దేశ కాలాధీనంగా (సమయాన్ని బట్టి) పొందుతున్న శుభాశుభ ఫలాలనే అందరూ ‘దైవము’ అని పిలుస్తున్నారు. అంతే కానీ ‘దైవం’ అనగా… కంటికి కనిపించని, ఎక్కడో ఉన్న, కారణం లేకుండా అకస్మాత్తుగా ప్రవర్తించే ఏదో ఒక తెలియని శక్తి ఏమాత్రం కాదు.

“పురుషుడు ఈ భూలోకంలోనే జన్మిస్తున్నాడు.. ఇక్కడే పెరుగుతున్నాడు.. ఇక్కడే ముసలివాడు అవుతున్నాడు. ఈ విధంగా బాల్య, యౌవన, వార్ధక్యాలు ప్రతి మనిషికీ ఎలాగైతే ప్రత్యక్షానుభవంగా కళ్ళకు కనిపిస్తున్నాయో… అలా ఈ ‘అదృష్టము’ అనేది ఎవరికైనా ప్రత్యక్షంగా లభిస్తోందా? కనిపిస్తోందా? లేదు కదా! కాబట్టి మా ఉద్దేశంలో ఎలాంటి కార్యకారణం లేనట్టి ‘అదృష్టము’ అనేది అసలు లేనే లేదు” అని వశిష్ఠుడు తేల్చి చెప్పాడు.

సత్పురుషులు “పరమార్థాన్ని సాధించే యత్నాలనే” పౌరుషం అని పిలుస్తున్నారు. లౌకిక దృష్టితో చూసినా కూడా పౌరుషం వల్లే అభీష్టాలన్నీ నెరవేరుతున్నాయి. చేతులతో వస్తువులను కదపడం, మాట్లాడటం, చూడటం ఇలా ఇంద్రియాలు చేసే ప్రతి పనీ మనిషి ప్రయత్నం వల్లనే జరుగుతోంది తప్ప దైవ బలం చేత కాదు కదా!. ఒకవేళ నిష్ప్రయోజనమైన, అనర్థకరమైన ప్రయత్నాలు చేస్తే వాటి వల్ల అలాంటి ప్రయోజనాలే కలుగుతాయి.

ఒక అందమైన సరోవరంలో (చెరువులో) తామర పూలు వృద్ధి చెందాయనుకో.. అప్పుడు ఆ తామరల వల్ల ఆ సరోవరానికి, ఆ సరోవరం వల్ల తామర పూలకు పరస్పరం ఎంత అందం (శోభ) చేకూరుతుందో.. అలాగే సచ్ఛాస్త్ర, సాధు సాంగత్యాల వల్ల మనిషి బుద్ధికి, ఆ బుద్ధి వల్ల తిరిగి ఆ సాధు సాంగత్యానికి శోభ చేకూరుతుందని వశిష్ఠుడు వివరించాడు. అందుచేత వాటిని బాల్యం నుంచే అభ్యసించాలి.

“ఓ రామచంద్రా! ఈ ప్రపంచం అంతా ఏదో అదృష్టం చేత నడుస్తోందని ఎన్నడూ భ్రమపడకు. ఏది ఎక్కడ ఎలా జరుగుతున్నా, దాని వెనుక ఖచ్చితంగా ఒక ప్రయత్నం అంతర్లీనంగా దాగి ఉంటుందని నేను నిర్ద్వంద్వంగా (ఎలాంటి అనుమానం లేకుండా) ప్రకటిస్తున్నాను. సాక్షాత్తూ ఆ భగవంతుడైన విష్ణుదేవుడు కూడా తన నిజప్రయత్నం చేతనే కదా దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం చేస్తున్నాడు! అంతేకానీ ఆయనకు అదృష్టం ఏమైనా కలిసి వస్తోందా? కానే కాదు.

కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రయత్నశీలుడవై ఉండు. అన్ని అనుమానాలను వదిలేసి, ఏ ప్రయత్నం ఉచితమో నీ వివేకంతో విచారించి దానినే ఆశ్రయించు. రాత్రిపూట ఒక ఎండు కొయ్యను చూసి ‘ఇది పాము కాదా?’ అని ఎలాగైతే భ్రమపడతామో, అలాగే ‘దైవం’ లేదా ‘అదృష్టం’ అనే దాని పట్ల లేనిపోని భ్రమలు పొందవద్దు. మహత్తరమైన అవకాశాలు ఉన్న ఈ గొప్ప జీవితాన్ని మనుషులు పనికిరాని కల్పనలతో వృథా చేసుకోవడం తరచుగా జరుగుతోందని నేను నీకు హెచ్చరిస్తూ గుర్తు చేస్తున్నాను” అని వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని చేశాడు

పురుషార్థం మరియు దైవం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

వశిష్ఠుని ప్రకారం “పురుషార్థం” అంటే ఏమిటి?

శాస్త్రం అంగీకరించిన, మనిషికి సుఖాన్నిచ్చి దుఃఖాన్ని దూరం చేసే సత్ప్రయత్నాలనే ‘పురుషార్థం’ అని పెద్దలు నిర్ణయించారని వశిష్ఠుడు వివరించాడు.

వర్తమాన ప్రయత్నానికి, గత జన్మల కర్మలకు మధ్య సంబంధం ఏమిటి?

బలమైన చెట్టు బలహీనమైన చెట్టును కప్పివేసినట్లే, మనిషి చేసే వర్తమాన ప్రయత్నాలు (ఐహిక పురుషకారం) గత జన్మల ప్రాక్తన కర్మలను అణగదొక్కి కొత్త ఫలితాలను తీసుకురాగలవని వశిష్ఠుడు తెలిపాడు.

అదృష్టాన్ని నమ్మి ఏమీ చేయని వారి గురించి వశిష్ఠుడు ఏమన్నాడు?

ప్రయత్నం చేయకుండా అదృష్టం మీద భారం వేసేవారు క్షయం (నాశనం) వైపే పయనిస్తారని, తమ ధర్మార్థ కామాలను తామే నాశనం చేసుకుంటారని మహర్షి హెచ్చరించాడు.

చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది?

సచ్ఛాస్త్రాల అధ్యయనం, సత్పురుషుల సాంగత్యం, వారి ప్రవచనాలు వినడం ద్వారా లభించే జ్ఞానం చిత్తశుద్ధిని కలిగిస్తుందని వశిష్ఠుడు వివరించాడు.

మానవ ప్రయత్నం (పౌరుషం) ఎన్ని రకాలు?

పురుషార్థాన్ని సాధించాలనే ‘ఇచ్ఛ’ (బలమైన కోరిక), దాన్ని నెరవేర్చే ‘ప్రవృత్తి’ (శారీరక శ్రమ), దాన్ని ఎలా చేయాలో తెలిపే ‘తత్త్వజ్ఞాన వికాసం’ — ఈ మూడు కలిసి ఉత్తమ ఫలాన్నిస్తాయని వశిష్ఠుడు వివరించాడు.

“దైవం” అనే మాటను బుద్ధిమంతులు ఎందుకు ఉపయోగిస్తారు?

కష్టాల్లో ఉన్న అల్పబుద్ధి గలవారిని ఓదార్చడానికి, భయం లేదా భక్తితో వారు సత్కర్మలు చేసేలా ప్రోత్సహించడానికి మాత్రమే బుద్ధిమంతులు ‘దైవం’ అనే పదాన్ని వాడతారని వశిష్ఠుడు వెల్లడించాడు.

బృహస్పతి, శుక్రాచార్యుడు వంటి ఉదాహరణలు ఏం నిరూపిస్తాయి?

బృహస్పతి దేవతలకు, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువులు కాగలిగింది వారి స్వంత పురుషకారం (ప్రయత్నం) వల్లేనని, సంపదలున్నా దురలవాట్ల వల్ల నహుషుడు పతనమయ్యాడని వశిష్ఠుడు ఉదాహరించాడు.

మనిషి తన జీవితంలో నిజంగా దేనిపై ఆధారపడాలి?

కంటికి కనిపించని అదృష్టం మీద కాకుండా, తన సొంత పురుషకారం (ప్రయత్నం) మీదే పూర్తిగా ఆధారపడాలని, అదే శుభాశుభ ఫలితాలకు అసలు కారణమని వశిష్ఠుడు నొక్కి చెప్పాడు.


Share your love
A. Ravinder, RamthaMedia
A. Ravinder, RamthaMedia

A. Ravinder is the founder, chief editor and publisher of RamthaMedia.in, based in Hyderabad, India. He holds an M.A. in Economics and has spent decades studying thousands of ancient scriptures, religious texts and philosophical works, and is a lifelong meditation practitioner. Through years of work as a tour operator he has travelled across India visiting temples and pilgrimage sites. He has written thousands of articles and several books on spirituality and Hindu tradition.

Articles: 456